కన్నీళ్లొస్తున్నాయి
అవును…
నీవు విన్నది నిజమే.
ఆంక్షల బురదలో కూరుకుపోయిన
స్వేచ్చా సాహిత్యపు
ప్రస్తుత స్థితి చూస్తోంటే
దుఃఖం పెల్లుబుకుతోంది.
కెరటమై పరిగెత్తాలన్న దాని కోరికను
అడ్డంకుల బండలు గుద్దుకొంటుంటే
దాని చుట్టూ
కళ్ళుచించుకున్నా కానరాని
చిమ్మ చీకట్లు అలుముకున్నాయి.
ఊహించనే లేదుగా
దశాబ్దాల ఘనచరితలో
ఇంతటి నిశ్శబ్ద భీతి.
దారులు చెరిపేస్తూ విరబోసుకున్న
నియంతృత్వపు జాడల
విశృంఖల విహారపు ధాటికి
భీతుల్లుతోంది స్వేచ్ఛా సాహిత్యం.
దురాగతాల్ని ఎత్తిచూపిద్దామన్న
అక్షరాల ఆకాంక్షల ఆకాశాన్ని
ఆంక్షల అమాసలు ఆక్రమిస్తోంటే,
చీకటి దాడులు
వాటి ఆశల తాళ్లను కోసేస్తున్నాయి.
వాటి ఆవేదన చూడలేని కలం కదిలిందా
అంతే…
వారి అడుగులకు మడుగులొత్తే
కొన్ని అరచేతులు
పంజా విసిరే అదనుకై
సిద్ధంగా ఉంటాయి.
వాటి చేజిక్కిన
కొన్ని రాతలు జీవచ్ఛవాలైతే,
మరి కొన్నింటి ప్రాణాలు
పంచభూతాలలో కలిసిపోతాయి.
ఈ కబందహస్తాలనుండి
ఎప్పుడు బయటపడతామో
అని రోదిస్తున్నాయి అక్షరాలు.
తనను నిలువెల్లా దహిస్తోన్న
ఈ జ్వాలాముఖి
తుది అంకం ఎప్పుడోనని
ఎదురుచూస్తోంది స్వేచ్ఛా సాహిత్యం.
నేటి ఈ తమస్సు
ఉషస్సుగా మారేదెన్నడో?
– వేమూరి శ్రీనివాస్,9912128967, తాడేపల్లిగూడెం