సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: పట్టణ ఫుట్ పాత్ లకు న్యూ లుక్ వచ్చింది. సరికొత్త అందాలు అద్ది జిగేల్ అనేలా ప్రకాశవంతమైన వీధి దీపాలు వెలిగాయి. విశాలమైన రోడ్లు.. డివైడర్లు.. సెంట్రల్ లైటింగ్.. ఇవి మహానగరాలకే పరిమితం. కానీ మన సిద్ధిపేట పట్టణం మహానగరానికి తీసిపోని విధంగా రూపాంతరం చెందిందని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు చెప్పారు.పట్టణ సుందరీకరణలో భాగంగా హౌసింగ్ బోర్డు కాలనీలో సుడా ఆధ్వరంలో ప్రకాశవంతమైన వీధి దీపాలు వెలుగులు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. బస్టాండ్ నుంచి హైదరాబాదు రోడ్ పొన్నాల జంక్షన్ వరకూ 394 పోల్స్, బస్టాండ్ నుంచి మెదక్ రోడ్ ఇందిరాగాంధీ సర్కిల్ వరకూ 198 పోల్స్, బస్టాండ్ నుంచి కరీంనగర్ రోడ్ వేములవాడ కమాన్ వరకూ 178 పోల్స్ వెలుతురులో మొత్తం 770 పోల్స్ లతో స్ట్రీట్ లైట్లతో ఆయా ప్రాంతాలన్నీ జిగేల్ జిగేల్ గా మెరుస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, మున్సిపల్, సుడా అధికార యంత్రాంగం తదితరులు పాల్గొన్నారు.