సేంద్రియ వ్యవసాయ క్షేత్ర విస్తరణ జరగాలి

 రైతులు వాణిజ్య వ్యవసాయం నుంచి  విముక్తి పొందాలి…
రైతులకు అవసరమవుతున్న  విత్తనాలలో అత్యధిక శాతం తెలంగాణలోనే ఉత్పత్తి అవుతుండడం తెలుగువారికి గర్వకారణం.  విత్తనాల ఉత్పత్తికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞాన అంతర్జాతీయ సంస్థ  ఇంటర్నేషనల్‌ సీడ్‌ టెక్నాలజీ అసోసియేషన్‌ ఇస్టా ఇటీవల  తెలంగాణ రాష్ట్రం సాధించిన ఈ వ్యవసాయ ప్రగతిని  ప్రధానంగా ప్రస్తావించింది.   తెలంగాణలోని నాలుగు లక్షల ఏడువేల ఎకరాలలో ప్రతి సంవత్సరం సగటున అరవై ఐదు లక్షల క్వింటాలుల విత్తనాలు ఉత్పత్తి అవుతున్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు సైతం వెల్లడిరచారు. లక్ష ముప్పయి నాలుగు వేల మంది రైతులు విత్తనాలను ఉత్పత్తిచేస్తున్నారట. ఇతర దేశాలకు సైతం తెలంగాణ ఉత్పత్తి కేంద్రాలలో పండిన విత్తనాలు ఎగుమతి కావడం మరింత గర్వకారణం. ‘మొన్‌సాంటో’వంటి విదేశీయ సంస్థలు ఏళ్లతరబడి ‘బిటి’ పత్తి విత్తనాలను భయంకరమైన ధరలకు అమ్మి భారతీయ వ్యవసాయదారులను ప్రధానంగా ఉభయ తెలుగు ప్రాంతాల ప్రజలను దోచుకోవడం నడుస్తున్న చరిత్ర. తెలంగాణ వ్యవసాయదారులు సాధించిన సాధిస్తున్న ఈ ‘అంకురోత్పత్తి’ విజయాల వల్ల దేశ ప్రజలు ఈ ‘మొన్‌సాంటో’ వంటి విదేశాల దోపిడీ ముఠాల కబంధ బంధం నుంచి విముక్తి అయ్యారా? అన్న ప్రశ్నకు సమాధానం లభించవలసి ఉంది. జన్యు జీవకణ పరివర్తన..  జెనటిక్‌ మోడిఫికేషన్‌..  జిఎమ్‌..  ప్రక్రియ ద్వారా తయారవుతున్న విత్తనాలలో, అంకురాలలో, బాసిలస్‌ తురింజెనిసిస్‌- బిటి- అన్న ‘విష జీవ రసాయనం’ నిహితమై ఉండడం ధ్రువపడిన శాస్త్రియ వాస్తవం.  అందువల్లనే ఈ ‘బిటి’ పంటలను వివిధ దేశాలలో నిషేధించారు.
మన దేశంలో నిషేధించలేదు. ఈ ‘బిటి’ జీవ రసాయనం పంటల దిగుబడిని పెంచడానికి దోహదం చేస్తుందన్న భ్రాంతి వ్యాపించి ఉండడం ఇందుకు కారణం.  ఈ ‘భ్రాంతి’ ప్రాతిపదికగా ‘మొన్‌సాంటో’వంటి సంస్థలు ‘బిటి’ ‘పత్తి విత్తనాలను భయంకరమైన ధరలకు అమ్మేశాయి, అమ్ముతున్నాయి. తెలంగాణలో విత్తనాలను పండిస్తున్న రైతులలోను, రాయలసీమలోను కోస్తాప్రాంతంలోను, దేశంలోను విత్తనాలను పండిస్తున్న రైతులలోను ఎంతమంది ‘మొన్‌సాంటో’వంటి విదేశీయ సంస్థలతో అనుసంధానమై ఉన్నారు? ఎంతమంది స్వతంత్రంగా విత్తనాలను ఉత్పత్తి చేస్తున్నారు? ఈ ప్రశ్నలకు కూడ సమాధానం లభించవలసి ఉంది. ఎందుకంటె విదేశీయ వాణిజ్య సంస్థలతో ‘అనుసంధానం’ వహించి విత్తనాలను ఉత్పత్తిచేస్తున్న రైతులు భారీగా నష్టపోతున్నారు. అతి తక్కువ ధరలకు రైతులవద్ద ‘బిటి’ విత్తనాలను కొంటున్న ‘మొన్‌సాంటో’వంటి సంస్థలవారు అత్యంత అధిక ధరలకు వాటిని ఇతర రైతులకు విక్రయిస్తున్నారు.
దాదాపు నాలుగు దశాబ్దాల క్రితంవరకు మన దేశంలోని రైతులు తాము పండిరచిన పంటనుంచి తరువాతి పంటకు అవసరమైన విత్తనాలను సమకూర్చుకునేవారు. కందులను పండిరచిన రైతు తన పొలంలోని పంట కోతకు వచ్చిన సమయంలో, ముందుగా పెద్దపెద్ద  శ్రేష్ఠమైన  కాయలను కోసి విడిగా భద్రపరిచేవాడు. ఆ కాయలలోని కందులను ‘విత్తనాల కందులు’అని పిలిచేవారు. మరుసటి సంవత్సరం చేనులో విత్తడానికి ఆ ‘విత్తనాల’ను ఉపయోగించారు.
అందువల్ల విత్తనాలకోసం విడిగా కందులను కొనవలసిన పని ఉండేది కాదు. ఇది ప్రతీక మాత్రమే! అన్నిరకాల పప్పు దినుసుల, కూరగాయల, నూనె గింజల, ఆహార ధాన్యాల పంటలకూ ప్రతి రైతు తన పొలంలోనే ‘విత్తనాల’ను సమకూర్చుకోగలిగేవాడు. సజ్జలను పండిరచినవారు కోత సమయంలో పెద్దపెద్ద సజ్జకంకులను కోసి విడిగా బుట్టలలో తట్టలలో కుండలలో గాదెలలో విత్తనాలను భద్రపరిచేవారు. విత్తనం ‘సెనగ’కాయలు, విత్తనాల వడ్లు, విత్తనాల జొన్నలు… ఇలా విత్తనాలను ప్రతి రైతు పండిరచడం చరిత్ర! కూరగాయలకూ పండ్లకూ కూడ ఎక్కడికక్కడ స్థానికంగా విత్తనాలు సమకూడడం సంప్రదాయ, సేంద్రియ వ్యవసాయ చరిత్ర. ఈ సంప్రదాయం ఎందుకని ‘‘ఖిలమైపోయింది?’’ పునరుద్ధరించలేమా? తెలంగాణలో కాని, మరో భారతీయ ప్రాంతంలో కాని విత్తనాలు ఉత్పత్తికావడం, విదేశాలకు ఎగుమతి కావడం మన ఆర్థిక పరిపుష్టికి ప్రతీక కావొచ్చు… కానీ భారతీయ వ్యవసాయదారులు ఎవ్వరుకాని విత్తనాలను కొనని, తమంత తాముగా విత్తనాలను ప్రత్తి రైతు ఉత్పత్తిచేసుకోగల ఆదర్శ స్థితిని ఎందుకు పునరుద్ధరించరాదు?  ప్రభుత్వాలు ఈ దిశగా ఎందుకని ధ్యాసపెట్టరాదు?  విత్తనాలను కొనడానికే పెద్ద మొత్తం ఖర్చవుతోంది. వ్యవసాయ వ్యయం పెరగడానికి ఇది కూడ ఒక ప్రధాన కారణం! కోటి ఎకరాలకు తెలంగాణ ప్రభుత్వం సేద్యపు నీటిని సమకూర్చనుంది. దేవమాతృకలైన .. కేవలం వర్షపు నీటివల్ల పండే భూములు..  మరిన్ని లక్షల ఎకరాలు ఉండవొచ్చు.

 

దాదాపు నాలుగు లక్షల ఎకరాలలో లక్షా ముప్పయి నాలుగువేల మంది రైతులు విత్తనాలు పండిస్తున్నారు. అంటే మిగిలిన కోటికి పైగా ఎకరాలలో వ్యవసాయం చేస్తున్న దాదాపు అరకోటి మంది రైతులు విత్తనాలను కొంటున్నారన్న మాట. తెలంగాణ ‘ప్రతీక’మాత్రమే. దేశమంతటా ఇదే తీరు… రెండు శాతం వ్యవసాయదారులు విత్తనాలను ఉత్పత్తి చేస్తున్నారు. ‘మిగిలిన తొంబయి ఎనిమిది శాతం అత్యధిక ధరలకు విత్తనాలను కొంటున్నారు. ఉత్పత్తిచేస్తున్న రెండు శాతం రైతులనుండి వాణిజ్యసంస్థలు చౌకగా కొని తొంబయి ఎనిమిది శాతం రైతులకు భారీ ధరలకు విత్తనాలను అమ్ముతున్నారు. వ్యవసాయదారుల జుట్టు వాణిజ్య సంస్థలలో ఇరుక్కొని ఉన్న వర్తమాన వైపరీత్యానికి ఈ విత్తనాల ఉత్పత్తి ఒక ప్రతీక మాత్రమే! వందశాతం భూమిని సేంద్రియ, సంప్రదాయ వ్యవసాయ క్షేత్రంగా మార్చడంవల్ల ‘వాణిజ్య వ్యవసాయం నుంచి’ విముక్తి లభించగలదు.
‘సిక్కిం’ ప్రాంతంలో మొత్తం వ్యవసాయం ‘సేంద్రియం’గా మారింది. చిన్న రాష్ట్రమైన సిక్కిం సాధించిన విజయాన్ని పెద్ద రాష్ట్రాలు ఎందుకని సాధించలేవు?  కేరళ రాష్ట్రంలో అనేక  మండలాలు  ఇలా సంపూర్ణ సేంద్రియ వ్యవసాయ క్షేత్రాలుగా రూపొంది ఉన్నాయి.  సేంద్రియ వ్యవసాయం జరగాలంటే విష పూరితమైన రసాయన  ఎరువుల వాడకం రద్దుకావాలి. అటవీ ఉత్పత్తులు, ఆవు పేడ, మూత్రం, పశువుల పేడ వంటి ప్రాకృతికమైన ఎరువులను ఉపయోగించాలి. ఈ సేంద్రియ  వ్యవసాయ క్షేత్రాలలోని పంటలకు ‘క్రిమి సంహార విషాలు’ కూడ అవసరం లేదు. రైతులు తమ పొలంలోనే మరుసటి పంటకు విత్తనాలను సమకూర్చుకోగలరు… అందువల్ల కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వ నిర్వాహకులు సేంద్రియ వ్యవసాయ క్షేత్ర విస్తరణకు కృషిచేయాలి! మన దేశంలో ఇంతవరకు ‘బిటి’ పత్తివిత్తనాల ఉత్పత్తికి, పంపిణీకి మాత్రమే ప్రభుత్వం అనుమతించింది. ‘బిటి’ వంకాయ విత్తనాల ఉత్పత్తికి అనుమతి లేదు. కానీ హర్యానాలోను ఇతర కొన్ని ప్రాంతాలలోను దొంగతనంగా ఈ ‘విషపు’ ‘బిటి’ వంకాయలను ఉత్పత్తిచేస్తున్నారట! ఇలాంటి కొన్ని ‘‘అక్రమ వార్తాక’’ క్షేత్రాలను పసికట్టిన అధికారులు వాటిని ధ్వంసం చేశారట కూడ! కానీ ధ్వంసం కాని ఇలాంటి విషపు వంకాయలు ఎన్ని టన్నులు..  ఎన్ని వేల టన్నులు..  విపణి వీధులలోకి తరలివస్తున్నాయి? మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పసికట్టవలసిన వ్యవహారం ఇది.  -కందుల శ్రీనివాస్‌
సీనియర్‌ జర్నలిస్ట్‌
సెల్‌: 98484 43599 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page