ఇంటి ముందర ఒంటరిగా ఉన్న కుర్చీ ఒళ్ళో
కుదురుగా కూర్చొని
ఏ వైనో, వార్తాపత్రికనో తీక్షణంగా చూస్తూ ఉంటానా
కొన్ని పదాలు విరహంగా,విచారంగా,విషాదంగాను
మరికొన్ని ప్రేమగా,జాలిగా,అసహ్యంగానూ కనిపిస్తాయి
అన్నీ చదివాక మెదడు
కుత కుత కాగుతున్న నీళ్ళల్లో పడ్డట్టు ఉబ్బిపోతుంది
చికాకులో అన్నీ విసిరేసి
అదే కుర్చీలో వాలుగా జారీ కూర్చోని కల్లుమూసుకుంటే
మనసు…..
లంగరేసి గట్టిగా కట్టినా
నీళ్ళ మీద కదలాడే నావలాగా
అటూ…ఇటూ…. దొర్లుతూనే ఉన్నది
ఆలోచనలు…
నిండు ఎండాకాలం మిట్ట మధ్యాహ్నం వచ్చే
ఎండమావులలాగా అస్పష్టంగా
కదలాడుతూనే ఉన్నవి
తమాయించుకొని..తమాయించుకొని..
ఏదైనా రాసి బరువు దించుకోవాలనుకుంటానా..
కొన్ని ఆలోచనలు
మెదడుకు,చేతి వేళ్ళకు మద్యన
అక్షరాల పంజరంలో బందీకాక
అటునుండి అటే ఎగిరిపోతాయి
ఆకాశంలో పక్షుల్లాగా
కొన్ని ఆలోచనలు
విల విలా కొట్టుకుంటూ,గింజుకుంటూ
విధి లేక చేవలుడిగి పడిఉంటాయి
మొక్కజొన్న గింజలకో,వేటగాడి ఎరకో ఆశపడి
వలల చిక్కిన జీవుల్లాగా
కొన్ని ఆలోచనలు
విడిచిపెట్టిన మళ్ళీ వచ్చే పెంపుడు(బానిస) జంతువుల్లా
ఉన్నకాడనే ఉండి తిని బలిసే బాయిలర్ కోళ్ళలా
ఒకటెనుక ఒకటి బాయిల పడే గొర్రెళ్ల పడిఉంటాయి
అచ్చం చేవలేని మనుషుల్లాగా
సరే…. పోంగ పోయిన వాటిని వదిలేసి
వలల చిక్కిన వాటిని
కదలక పడిఉన్నవాటిని పట్టుకుని
ఏదైనా రాద్దామని అనుకుంటానా
ఏ మోహాన్నో,ఏ విరహాన్నో ముద్దాడుదామనుకుంటే…
ఏ మన్మధ కవి చిత్రాన్నో చూపించి
నను చిన్నబుచ్చుతాయి
ఏ బాధనో,జాలినో కొలుద్ధామనుకుంటే…
ఏ కరుణా కవి సాగరాన్నో
నను నిలువునా ముంచుతాయి
ఏ ఆవేశాన్నో,ఆక్రోశాన్నో ఝులిపిద్ధామనుకుంటే…
ఏ విప్లవ కవి కలం ఖడ్గ ధ్వానాలనో వినిపించి
నను అవమానపరుస్తాయి
విసుగుతో అన్నీ విసిరేసి
కుర్చీలో ఉన్నవాన్నళ్ళా ఉన్నపళంగా ఆకాశంలోకెగిరా
నాదైన స్వెచ్ఛాలోచనను అక్షరీకరిద్దామని
మరి మీరూ..?
– దిలీప్.వి, జిల్లా కార్యదర్శి, మానవ హక్కుల వేదిక
ఉమ్మడి వరంగల్ జిల్లా, 8464030808