ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 26 : ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి దమ్ముంటే వయానాడ్ లో పోటీ చేయాలని తన స్థాయి మరిచి ఏఐసీసీ నాయకుడు రాహుల్ గాంధీ పై విమర్శలు చేయడం మానుకోవాలని యువజన కాంగ్రెస్ నాగర్ కర్నూల్ పార్లమెంట్ మాజీ ప్రధాన కార్యదర్శి, కడ్తాల కోఆప్షన్ మెంబర్ జహంగీర్ బాబా హితువు పలికారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అసదుద్దీన్ ఓవైసీకి దమ్ము ధైర్యం ఉంటే హైదరాబాద్ పార్లమెంట్ స్థానం కాకుండా దేశంలో వేరే పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయగలరా..? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ పాతబస్తీకే పరిమితమని ముస్లింలను రెచ్చగొట్టడం కాకుండా వారి అభివృద్ధికి పాటుపడాలని హితువు పలికారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించి విద్య ఉద్యోగాల్లో సముచిత స్థానం కల్పించిందన్నారు. ఆ రిజర్వేషన్ల ద్వారా ఎంతోమంది వివిధ రంగాల్లో స్థిరపడి కుటుంబాలను పోషించుకుంటున్నారని గుర్తు చేశారు. మీ స్వార్థ రాజకీయాలకు బిజెపితో కుమ్మక్కై అమాయక ముస్లిం మైనార్టీలను బలి చేస్తున్నారని అన్నారు. మీ వ్యక్తిగత లాభాల కోసం అధికార బిఆర్ఎస్ పార్టీతో జత కలిసి ఎన్నో సొంత ప్రయోజనాలను పొందుతూ దినదిన అభివృద్ధి చెందుతున్నారన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు ఇస్తామన్న 12 శాతం రిజర్వేషన్ గురించి ఏనాడైనా ముఖ్యమంత్రి కేసీఆర్ తో పోరాడారా అని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంతమంది ముస్లిం మైనార్టీ లకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేయించారని ఆలోచన చేసుకోవాలన్నారు. రాహుల్ గాంధీ పై విమర్శలు మానుకోవాలని హితువు పలికారు.